
విజయవాడ, మే 3,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల రాజధానికి మరి కొద్ది క్షణాల్లో శంకుస్థాపన జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి వచ్చి మరీ పాల్గొంటున్నారు. ముందుగా సేకరించిన 33 వేల ఎకరాలకు తోడు మరో 44 వేల ఎకరాలను సేకరించి దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. విమర్శలను సయితం పక్కన పెట్టి రాజధాని నిర్మాణం పూర్తయితే వచ్చేకిక్కు కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. తాను హైదరాబాద్ లో సైబరాబాద్ ను డెవలెప్ చేసినప్పుడు వచ్చిన ఇమేజ్ కు మించి అమరావతి నిర్మాణంతో రావాలని నాయుడుగారు భావిస్తున్నారు. అందుకోసం లక్షల కోట్ల రూపాయలను వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. తొలిదశలోనే దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయల విలువైన పనులకు నేడు శంకుస్థాపన జరగుతుంది. ఇంకా రాజధాని ప్రాంతంలో నవనగరాల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తే చాలు ఇక తన జీవితం చరితార్థమవుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే వందలకోట్ల రూపాయలు వెచ్చించి ఇంత ఆర్భాటంగా చంద్రబాబు నాయుడుఅమరావతి రాజధాని పనులకు శంకుస్థాపన మళ్లీ చేయనున్నారు. దీనికి రీ లాంచింగ్ అని పేరు పెట్టినా అమరావతికి హైప్ తెచ్చేందుకే మరోసారి శంకుస్థాపనలు చేయిస్తున్నారన్నది వాస్తవం. . దాదాపు డెబ్భయి ఏడు ఎకరాలు ఒక్క రాజధానిలో ఉండటంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాలను కలిపితే ఇక ఏపీకి తిరుగుండదని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అప్పుడు పెట్టుబడుల కోసం తాము కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదని, వాటంతట అవే వచ్చిపడతాయన్న నమ్మకంతో ఏపీ సీఎం ఉన్నారు. మరోవైపు వీలయినంత త్వరగా కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఏర్పాటు చేసే విధంగా సహకరించాలంటూ నేడు మోదీని చంద్రబాబు నాయుడు కోరనున్నారు. ఇప్పటకే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. దీంతో పాటు రైతులు ప్లాట్లుగా ఇచ్చిన భూమి పోగా ప్రభుత్వానికి భారీగా వేలాది ఎకరాలు మిగలనున్నాయి. ఈ మిగిలిపోయిన ఎకరాలను వేలం వేసినా రాజధాని నిర్మాణం కోసం చేసిన ఖర్చు వెనక్కు తిరిగి వస్తుందని చంద్రబాబు అంచనా. అందుకే తెగించి ఆయన ఈ నిర్ణయం తీసుకునట్లే కనపడుతుంది. వేగంగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత తనకు ఇంకేమీ ఆశ మిగలదని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంటే ఆయన అమరావతి నిర్మాణాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. రాజధాని అమరావతి పూర్తయిన తర్వాత తనను తెగిడిన వాళ్లు కూడా ఖచ్చితంగా పొగుడ్తారని ముందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది తెలియాలంటే మరో మూడేళ్ల కాలం వెయిట్ చేయాల్సిందే.