
హైదరాబాద్, మే 5,
ఒకటి కంటే ఎక్కువ అంతస్తులు ఉండే ఇండ్లు, భవనాలు, అపార్ట్‌మెంట్లలో కింది నుంచి పైకి వెళ్లేందుకు సాధారణంగా లిఫ్టులను వాడుతారు. లిఫ్ట్ ద్వారా కింది నుంచి పైఅంతస్తులోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేలా ఉండాలి. కానీ ప్రాణాలు పోయేలా కాదు. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తే లిఫ్టులు ప్రాణాలు తీసే యంత్రాలుగా కనిపిస్తున్నాయి.హైదరాబాద్ నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల్లో నాసిరకం లిఫ్టులు.. తక్కువ శ్రద్ధతో నిర్వహణ, అధిక వాడకంతో ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. కేవలం గత నెలలోనే నాలుగు లిఫ్ట్ ప్రమాదాలు జరగడం గమనార్హం. కొన్ని ఘటనల్లో ప్రాణనష్టం జరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు లిఫ్ట్ యాక్ట్ అమల్లోకి రాలేదు. భద్రతా ప్రమాణాలు, లిఫ్ట్‌ల నాణ్యత, సరఫరాదారుల అర్హతలు, నిర్వహణ మార్గదర్శకాలు లేకపోవడంతో నిర్మాణదారులు తక్కువ ఖర్చుతో నాసిరకం లిఫ్ట్‌లను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఇత ర రాష్ట్రాల్లో (కర్ణాటక, మహారాష్ర్ట, తమిళనాడు) ఇప్పటికే నిషేధించబడిన కొలా ప్సిబుల్ డోర్ లిఫ్టులు రాష్ర్టంలో ఇప్పటికీ వాడుతున్నారు.కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మాణాలు చేపట్టే యజమానులు లిఫ్టులను ఏర్పాటు చేసే విషయంలో మాత్రం తక్కువలో వచ్చే నాసిరకమైనవి ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వందమంది నివసించే అపార్ట్‌మెంట్లలో కనీసం 6 నుంచి 8 మంది కెపాసిటీ ఉండే లిఫ్టులను ఏర్పాటుచేయాలి.కానీ డబ్బులు తక్కువ అవుతా యని నాలుగు నుంచి ఆరుగురు మాత్రం ఎక్కే కెపాసిటీ ఉన్న లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా ఓవర్‌లోడ్ వల్ల లిఫ్టు ప్రమాదాలు జరుగుతున్నాయి.
* నాలుగేళ్ల బాలుడు నరేందర్ లిఫ్ట్ గేట్‌లో ఇరుక్కొని మృతి
* మరో ప్రమాదంలో లిఫ్టులో ఇరుక్కుని వాచ్‌మన్ కుమారుడు అక్కడికక్కడే చనిపోయాడు
* మియాపూర్‌లో ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లకు లిఫ్ట్ ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా ఒకరు చనిపోయారు
* మాసాబ్ ట్యాంక్‌లో 6 ఏళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కొని తీవ్ర గాయాలు
* సిరిసిల్లలో ఓ పోలీస్ ఆఫీసర్ లిఫ్ట్ ప్రమాదంలో మృతి
తెలంగాణ ఎలివేటర్స్, ఎస్కలేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ నర్సింహారావు చెప్పిన ప్రకారం.. చాలా అపార్ట్‌మెంట్లలో ట్రాన్స్‌ఫార్మర్లు లేకుండానే లిఫ్ట్‌లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లో వోల్టేజ్ కారణంగా లిఫ్ట్ ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంది. చాలామంది లిఫ్ట్ మెకానిక్స్ లేకుండానే లిఫ్టులను నిర్వహిస్తున్నారు. ఫలితంగా సరైన నిర్వహణ ఉండడం లేదు.ఈ రెండు సమస్యలు ప్రమాదాలకు మూలకారణాలుగా మారుతున్నాయి. వీటితోపాటు లిఫ్ట్ సామర్థ్యాన్ని పట్టించుకోకుండా భవన యజమానులు లిఫ్టులను మరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మోటార్, మిగిలిన పరికరాలపై ఒత్తిడి పెరిగి యంత్రాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతోంది. సందర్భాల్లో వాచ్‌మెన్‌లు, అటెండర్ల నిర్లక్ష్యం వల్ల కూడా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. సదరు లిఫ్ట్‌లు తగిన నిబంధనలు పాటించకుండా ఉపయోగించడమే కాకుండా, మెకానిక్‌ల సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.2015లో డ్రాఫ్ట్ బిల్లుగా సిద్ధమైన లిఫ్ట్ చట్టం ఇప్పటికీ అధికారికంగా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఆఖరి దశలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా, దీనిపై స్పష్టమైన విధివిధానాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. లిఫ్ట్ చట్టం అమల్లోకి వస్తే..లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవుతుంది.సరఫరాదారులకు లైసెన్సింగ్ విధానం అమలవుతుంది. నాణ్యమైన, భద్రత కలిగిన లిఫ్ట్‌లనే ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో లిఫ్ట్ చట్టాన్ని వెంటనే అమలులోకి తేవాలని, ప్రతీ భవన యజమాని లిఫ్ట్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.