
హైదరాబాద్, మే 7,
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు భారత ప్రభుత్వం ఏం చేస్తుందా అని ఎదురుచూసిన వారికి సమాధానం దొరికింది. గతంలో పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. రాత్రికి రాత్రే వెళ్లి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఊహించని విధ్వంసాన్ని వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 22న పహల్గాంలో మరో భారీ ఉగ్రదాడి జరగగా, అందుకు ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి నామరూపాలు లేకుండా చేసి భారత బలగాలు విజయవంతంగా తిరిగొచ్చాయని రక్షణ శాఖ తెలిపింది. భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై నేతలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఏఐఎంఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మరో పహల్గాం లాంటి దాడులు జరగకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన బదులిచ్చింది మన సైన్యం. మళ్లీ ఉగ్రదాడులు జరగకండా పాకిస్తాన్ కు కఠినమైన గుణపాఠం చెప్పాలి. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు వారి మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్!" అని అసదుద్దీన్ ఒవైసీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.ఇటీవల పహల్గాం దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తాం అన్నారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నేతలు, ప్రజలతో కలిసి పహల్గాం ఉగ్రదాడిని నిరిసిస్తూ ఇటీవల నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. చెప్పినట్లుగానే.. పాకిస్తాన్, పీఓకేలో భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ఆయన సమర్థించారు. మరోసారి మనవైపు కన్నెత్తి చూడకుండా పాక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలన్నారు. భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.