YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జగిత్యాలలో కార్యక్రమాలకు మంత్రులు దూరం

జగిత్యాలలో కార్యక్రమాలకు మంత్రులు దూరం

కరీంనగర్, మే 7, 
జగిత్యాల కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి…జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనే చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జీవన్ రెడ్డికి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను హస్తం పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆయనతో కలిసి పని చేయడానికి ససేమిరా అంటుండడంతో రెండు వర్గాలుగా విడిపోయింది జగిత్యాల కాంగ్రెస్. ప్రస్తుతం ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైందట పరిస్థితి.జీవన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా..ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి దూరంగా ఉంటున్నారు. అందుకే జీవన్ రెడ్డిని కాదని కొంతమంది పార్టీ శ్రేణులు..సంజయ్ కుమార్ తో సఖ్యతగా మెదలడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా ప్రారంభించాలన్నా అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయాలన్నా జగిత్యాలకు అమాత్యులు ఆమడ దూరం ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే పొరుగు నియోజకవర్గమైన ధర్మపురి ఎమ్మెల్యే, జగిత్యాల జిల్లా అధ్యక్షుడైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం జీవన్ రెడ్డి మాట జవ దాటరు. అందుకే జీవన్ రెడ్డి పట్ల విధేయతను ప్రదర్శించే క్రమంలో లక్ష్మణ్ కుమార్..ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలుపుకొని వెళ్లేందుకు సంకోచిస్తుంటారట. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం జీవన్ రెడ్డిని కాదని నియోజకవర్గంలో అడుగు పెట్టే పరిస్థితి లేదట. ధర్మపురి నియోజకవర్గంలో జరిగే ఏదో ఒక అభివృద్ది పనులకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవగా..వారంతా జగిత్యాలను టచ్ చేయకుండానే వెళ్లిపోతున్నారట. సంజయ్ కుమార్ ను ఒంటరిని చేయడానికే జీవన్ రెడ్డి మంత్రులను అడుగు పెట్టకుండా చేస్తున్నారనే టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో సాగుతోంది.సీఎం రేవంత్ రెడ్డి మనిషిగానే ఎమ్మెల్యే సంజయ్ కి ముద్ర పడింది. సంజయ్ సైతం నియోజకవర్గ అభివృద్ది నిధుల కోసం నేరుగా సీఎంనే సంప్రదించి నిధులను మంజురు చేయించుకుంటున్నారట. దీంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంజయ్ ని పార్టీ నాయకత్వం అక్కున చేర్చుకున్నట్లా లేనట్లా అనే చర్చ జగిత్యాల రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఎవరూ సాహసించకలేకపోతున్నారట. దీంతో ఇద్దరి మధ్య అంతర్గత విభేధాలు కాస్తా రచ్చకెక్కుతున్నాయి.ఇద్దరు నేతల వ్యవహరంతో స్వపక్షంలో విపక్షంలో మారింది పరిస్థితి. ఒకే జెండా కింద రాజకీయాలు సాగిస్తున్న జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్..వీరిద్దరి చేతులు కలిసేంత వరకు జగిత్యాలలో మంత్రులు అడుగు పెట్టరనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇలా వీరిద్దరు ఎంతకాలమని కలవని రైలు పట్టాల్లా ఉంటారో చూడాలంటూ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీ కోసమైనా ఇద్దరూ కలుస్తారా.. లేక ఎప్పటికీ డిష్యూం డిష్యూం అనుకుంటూనే ఉంటారా అనేది చూడాలి.

Related Posts