
విజయవాడ, మే 10,
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. చివరికి పార్టీలో ముఖ్య నేతలు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. మొన్న ఆ మధ్యన పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ నేతలు చేరుతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. వైసిపి హయాంలో చాలామంది ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. వారంతా ఇప్పుడు అధికారికంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.వైయస్సార్ కాంగ్రెస్ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఉద్యోగ సంఘం మాజీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బివి సుబ్బారావు, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, కృష్ణ జిల్లా ఎన్జీవో సంఘం నాయకుడు తోట సీతారామాంజనేయులు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీవోస్ కార్యదర్శి ఉమామహేశ్వరరావు తదితరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతం నుంచి ఈ నేతలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. ఇప్పుడు అధికారికంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం.కూటమి ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయనందునే.. తామంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఉద్యోగ సంఘం మాజీ నాయకులు తెలిపారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని.. ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు అన్నారు. ఉద్యోగులంతా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను తలచుకుంటున్నారని.. మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు తాము కృషి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న సమస్యలు, ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచనల్లో వచ్చిన మార్పులను జగన్మోహన్ రెడ్డికి వారు వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని వారు చెప్పుకొచ్చారు.మరోవైపు జగన్మోహన్ రెడ్డిపాలనను ఉద్యోగ సంఘం మాజీ నేతలు ఆకాశానికి ఎత్తేశారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పాలనతో గుప్తుల స్వర్ణ యుగాన్ని గుర్తుకు తెచ్చారన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రపంచమంతా ఇబ్బంది పడిందని.. కానీ ఏపీలో జగన్ మాత్రం సంక్షేమ పథకాలను ఆపకుండా రాష్ట్ర ప్రజలను తన కుటుంబంలో కాపాడుకున్నారని గుర్తు చేశారు. ఓటమి ప్రభుత్వం లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసినా.. ఆ డబ్బంతా ఎటు పోయిందో అర్థం కావడం లేదని అన్నారు. మోసపూరిత హామీలతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని తేల్చి చెప్పారు.