
హైదరాబాద్, మే 21,
హైడ్రా ప్రజావాణికి సామాజిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాల స్థలాల కబ్జాపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజావాణిలో కబ్జాలపై 59 ఫిర్యాదులు వచ్చాయి.ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేయడం పరిపాటిగా మారిపోయిందని అనుకుని, గమ్మున ఉండడంలేదు హైదరాబాద్ ప్రజలు. ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కారమౌతున్న తీరును చూసి హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే దశాబ్దాల సమస్యకు పరిష్కారం ఇట్టే దొరుకుతోందని గ్రహించి నగరవాసులు పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాపై ఫిర్యాదులు చేస్తున్నారు.హైడ్రా ప్రజావాణికి వచ్చిన 59 ఫిర్యాదుల్లో 70 శాతం సామాజిక ఫిర్యాదులే ఉన్నాయి. టోలిచౌకి హకీంపేటలో బాబా హోటల్ వద్ద రోడ్దును ఆక్రమించి షాపు పెట్టేశారంటూ నివాసితులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సుభాష్‌నగర్‌లో కొంపల్లికి వెళ్లే 50 అడుగుల రహదారి 100 అడుగుల మేర 10 ఫీట్లకే పరిమితమైందని స్థానికులు ఫిర్యాదు చేశారు.కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో సర్వేనంబరు 155లో ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించిన 3500 గజాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని భగత్‌సింగ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ ప్రజావాణికి ఫిర్యాదు చేసింది. గతంలో మున్సిపాలిటీ అధికారులు కూల్చేసినా దానిని మళ్లీ కబ్జా చేస్తున్నారని పేర్కొంది.
స్మశానాన్ని అమ్మేశారు
ఓయూ కాలనీలో తమ ప్లాట్ ను నలువైపుల మూసివేయడంతోపాటు రహదారి పక్కనే ఉన్న స్మశానాన్ని విక్రయించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు.మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామంలో సర్వే నంబరు 33\10లో మొత్తం13 ఎకరాల భూమి ఉండగా.. అందులో 6 ఎకరాల్లో మాతా అరవింద్ కాలనీ ఉంది.మిగతా 7 ఎకరాలను సొంతం చేసుకున్న వ్యక్తి తమది దేవాదాయ శాఖ పరిధిలో ఉందంటూ అధికారులకు ఫిర్యాదు చేసి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.నార్సింగి మండలం మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ లోని డాలర్ హిల్స్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సర్వే నంబరు .104\1, 106, 113లలో సంతోష్‌రెడ్డితో అతని మిత్ర బృందానికి మొత్తం 60 ఎకరాల భూమి ఉంది. ఇందులోని 30 ఎకరాలలో 1998లో డాలర్‌హిల్స్ పేరిట సంతోష్‌రెడ్డి లే ఔట్ వేశారు. హెచ్ఎండీఏ ప్రిలిమనరీ లే ఔట్ తో మొత్తం 80 శాతం ప్లాట్లు అమ్మేశారు.సరైన సమయంలో చెల్లింపులు, అభివృద్ధి చేయకుండా లే ఔట్ రద్దయ్యేలా ప్రయత్నించారు. సాంకేతిక కారణాలతో 2005లో ఈ లే ఔట్‌ను హెచ్ఎండీఏ రద్దు చేసింది.స్థల యజమానులు కుమ్మక్కయి ఒక అవగాహనకు వచ్చి వ్యవసాయ భూమిగా తర్వాత మార్చుకున్నారు. ఇది అప్పటికే ప్లాట్లు కొన్నవారికి తెలియదు. తర్వాత ఎల్ఆర్ఎస్ ద్వారా అనుమతులు తీసుకుని కొంత మంది ఇళ్లు కట్టుకున్నారు.డాలర్‌హిల్స్ లే ఔట్‌లోని 2 ఎకరాల పార్కు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను కలిపి పక్కనే ఉన్న 30 ఎకరాల భూమికి జోడించారు. మొత్తం వ్యవసాయ భూమిగా పేర్కొంటూ ఎన్‌సీసీ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు సంతోష్‌రెడ్డితో పాటు భూమిపై హక్కు ఉన్నవారు అమ్మేశారు. 2016 నుంచి ఈ వివాదం కోర్టులో ఉంది.కోర్టులో వివాదం ఉండగానే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అయినా అనుమతులేవీ లేకుండా ఎన్‌సీసీ అక్కడ నిర్మాణాలు చేపడుతోందని డాలర్‌హిల్స్ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ నెల 14న క్షేత్రస్థాయిలో అధికారులతో పరిశీలించారు.హైడ్రా కార్యాలయానికి ఇరు పక్షాలను పిలిచి విచారించారు. సంతోష్‌రెడ్డిపై తాము నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా పెట్టామని ప్లాట్ల యజమానులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్‌సీసీ సంస్థ చేపట్టిన నిర్మాణాలను ఆపడమే కాకుండా.. వాటిని హైడ్రా తొలగించింది.