
గుంటూరు, జూన్ 24,
వైసీపీలో నేతలు ఎందుకు భయపడుతున్నారు? పల్నాడు టూర్ వ్యవహారం అధినేతతోపాటు కేడర్‌కు చిక్కులు తెచ్చిపెట్టిందా? ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు కీలక నేతలు ముఖం చాటేస్తున్నారా? పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కేడర్ ఆలోచన చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధినేత అనేవారు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే నేతలేకాదు.. చివరకు కేడర్ సైతం దూరం అవుతుంది. వైసీపీకి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైంది. పల్నాడు టూర్ వ్యవహారంలో కీలక నేతలపై గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ టూర్‌లో జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి ఓ వ్యక్తి చనిపోవడంతో కలకలం రేపింది. దీనికి సంబంధించి సాక్షాలు బయటపెట్టి కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1 రమణారెడ్డి కాగా, ఏ2గా జగన్ పేరు ప్రస్తావించారు. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీ సైడ్ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ అయ్యింది. అంటే ఒక వ్యక్తికి చావుకు కారణమైనప్పుడు ఆ తరహా సెక్షన్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం పల్నాడు పోలీసులు అదే చేశారు. ఈ కేసు నమోదు చేయడానికి ముందు ఆ సెక్షన్‌పై కూలంకుషంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంతో చావుకు కారణమని భావించి బీఎన్‌ఎస్ 106(1)) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తులో దొరికిన ఫుటేజీలు ఆధారంగా కల్పబుల్ హోమీసైడేనని నిర్ధారణకు వచ్చారు అధికారులు. చివరకు ఈ సెక్షన్ జత చేశారు.జగన్ సహా మిగతా నిందితులపై ఈ సెక్షన్ పెట్టారు పోలీసుల. నేరం నిరూపణ అయితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించే అవకాశముందని కొందరు అడ్వకేట్లు చెబుతున్నమాట. నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానా రెండూ విధించేందుకు అవకాశముందని అంటున్నారు. ఈ సెక్షన్ పూర్తిగా నాన్ బెయిల్‌బుల్ సెక్షన్ అని అంటున్నారు. నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బీఎన్‌ఎస్ 49 సెక్షన్‌ను ఈ కేసులో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఫుటేజ్ ఉండడంతో అధినేత జగన్‌కు కష్టాలు తప్పవని అంటున్నారు నేతలు, కేడర్. కేసు వేగంగా దర్యాప్తు న్యాయస్థానం ముందుకు వస్తే జగన్‌కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరోవైపు సాక్షి టీవీ డిబేట్‌లో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు అమరావతి మహిళలు. ఆయనకు మద్దతుగా మాట్లాడిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ‘సాక్షి ఛానల్‌పై కడుపు మంటతో నిరసన వ్యక్తం చేస్తున్నారని చెబుతూనే మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు అమరావతి మహిళలను పిశాచులు, రాక్షసులు, రెండు కలిసిన సంకరజాతికి చెందినవారుగా వర్ణించారు. ఆ తెగకు చెందినవారిగా కనిపిస్తున్నారని, అలాంటి వారు మాత్రమే చేస్తారని’ వ్యాఖ్యానించారు. తమ ఆత్మాభిమానం దెబ్బతినేలా సజ్జల వ్యాఖ్యలు చేశారని భావించింది మాదిగ కార్పొరేషన్. ఆ సంస్థ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలను హేళన చేయడంతోపాటు వారి పుట్టుకను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఒకేరోజు అధినేత, కీలక నేతపై కేసులు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది కేడర్.