
నెల్లూరు, జూలై 7,
కందుకూరు, సింగరాయకొండ సమీపంలోని కరేడు గ్రామం మండుతోంది. సారవంతమైన భూములు ఒక కంపెనీకి కట్టబెడతామంటే ఊరుకోబోమంటూ అక్కడి రైతులు రోడ్డెక్కారు. బంగారం పండే తమ భూములను వదిలి తామెక్కడకి పోవాలనేది వారి ప్రశ్న. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆక్కడి ప్రజలు ఇటీవల హైవే దిగ్బంధం చేయడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. అక్కడి రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, BYC పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు"కరేడు" గ్రామం ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పలువురు ఎనలిస్ట్‌లు, గ్రామ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం గత వైసీపీ హయాంలో ఇండిసోల్ అనే కంపెనీ కోసం పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 5000 ఎకరాల భూమిని రామాయపట్నం పోర్టు సమీపంలో కేటాయించింది. అది జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుల కంపెనీ అని ప్రజలకు రైతులకు అన్యాయం చేసి భూమిని అప్పజెబుతున్నారు అంటూ వామపక్షాలు, ప్రజలు ఆరోపించారు. 2024 ఎన్నికల ముందు ఆ భూ కేటాయింపులను మరింత పెంచారు. యువగళం పాదయాత్రలో భాగంగా పర్యటనకు వచ్చిన లోకేష్ ఆ సంస్థ జగన్ సన్నిహితులదే అని విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ భూసేకరణ ఆపేస్తారని అనుకున్నామని కానీ ఆలా జరగలేదు అని గ్రామస్తులు అంటున్నారు. రామాయపట్నం సమీపంలో జగన్ ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బీపీసీయెల్ రిఫైనరీ కోసం వెనక్కి తీసుకున్నారు. దానికి బదులు 'కరేడు' గ్రామం దగ్గర 8000 ఎకరాలపైగా భూమిని ఇండో సోల్ కంపెనీకి కేటాయించడం వివాదాస్పదమైందని అంటున్నారు వామపక్షాల నేతలు. "అప్పుడు జగన్, ఇప్పుడు కూటమి కేటాయించిన భూములు అత్యంత విలువైనవని చెబుతున్నారు రైతులు. "రెండేసి పంటలు పండించే భూమి. కాస్త లోతుగా తవ్వితే చాలు నీరు పడే సారవంతమైన భూములు. ప్రైవేటు కంపెనీకి కేటాయించడం ఏంటి. ఇదే ప్రాంతంలో ఎన్నో అప్‌ల్యాండ్ లేదా డ్రైల్యాండ్‌ను పరిశ్రమకు కేటాయించాలి. తమ భూముల్ని మాత్రం వదిలేయాలి" అని కరేడు గ్రామస్తుడు వెంకటేశ్వర్లు అంటున్నారు. కరేడు గ్రామానికి చెందిన భూములు వదిలేయాలని నేషనల్ హైవేని దిగ్బంధించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పి తాత్కాలికంగా ఆందోళన అదుపు చేయగలిగారు. ప్రస్తుతానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ రైతులు ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. "ఈ భూ కేటాయింపు వల్ల అటు ఇటుగా పదివేల మందికిపైగానే ప్రభావితం అవుతారు. ముందస్తుగా 4వేల ఎకరాల సేకరణకు రాత్రికి రాత్రి నోటిఫికేషన్ ఇచ్చారు" అని ఉద్యమ నాయకుడు మిరియం శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలా రాత్రికి రాత్రే నోటిఫికేషన్ ఇవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ భూ సేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆందోళన ప్రభావం కందుకూరు నియోజకవర్గంతోపాటు కొండేపి,కావలి లాంటి కీలక నియోజకవర్గాలపైనా పడే అవకాశం ఉందని ఎనలిస్ట్‌లు అంటున్నారు.అప్పట్లో భూకేటాయింపులు చేసిన వైసిపిగానీ, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్న కూటమిగాని ఈ వివాదంపై నోరుమెదకపోవడం ఏంటని వైఎస్ షర్మిల, రామచంద్ర యాదవ్ లాంటి రాజకీయవేత్తలు విమర్శలు చేస్తున్నారు.