
కాకినాడ, జూలై 7,
కోనసీమ వాసులకు గుడ్ న్యూస్. అప్పుడెప్పుడో 2000లో ప్రారంభమైన ప్రాజెక్టు ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. కోర్టు కేసులు ఇతర సమస్యలతో మూలనపడిన రైల్వే ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా సాగుతందని ప్రజలు భావిస్తున్నారు. కోనసీమ రైల్వేలైన్ నిర్మాణానికి 2000లో శంకుస్థాపన చేశారు. కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం, రాజోలు, సిద్ధాంతం మీదుగా నర్సాపురం వరకు ఈ కోస్తా రైల్వే లైన్ నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం భావించింది. తొలి అలైన్‌మెంట్ 2001లో వచ్చింది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పనులు కూడా మొదలయ్యాయి. వివిధ కారణాలతో అక్కడి నుంచి ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ కావడంతో ప్రక్రియ ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రైల్వేలైన్ భూసేకరణ, రీ అలైన్‌మెంట్ సర్వేల విషయంలో చాలా మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తక్కువ పరిహారం ఇచ్చారని మరింత కావాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. పరిహారంలో జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని పాతికేళ్లుగా పోరాడుతున్నారు. దీంతో పనులపై ఇన్ని రోజులు కోర్టులు స్టే విధించాయి. ఇన్ని రోజులు విచారణ తర్వాత కోర్టులు ఆ స్టేలను ఎత్తివేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది. 102.507 కిలోమీటర్ల పొడవుతో రైల్వేలైన్ నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇందులో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు అంటే దాదాపు 45కిలోమీటర్ల నిర్మాణం పూర్తి అయింది. ఇంకా యాభై కిలోమీటర్లకు పైగా లైన్ నిర్మించాల్సి ఉంది. కోటిపల్లి నుంచి నర్సాపురం ఉన్న భూసేకరణ సమస్యతో పనులకు ఆటంకం ఏర్పడింది. కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తి అయింది. అక్కడి నుంచి నర్సాపురం వరకు చేపట్టాల్సిన భూసేకరణే ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారింది. ఏదోలా చేసి పనులు పూర్తి చేయాలని 2016 నుంచి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. పదేళ్లుగా గోదావరి మూడు నదీపాయలపై పిల్లర్ల పనులు పూర్తి చేశారు. మిగతా పనులకు టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. కానీ పనుల్లో మాత్రం వేగం కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వం ఈ రైల్వేలైన్ కోసం కావాల్సిన భూసేకరణకు చర్యలు చేపట్టింది. 2024 ఫిబ్రవరిలో 50 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. అమలాపురం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలలో భూసర్వే కూడా చేపట్టారు. కానీ పనుల్లో పురోగతి కనిపించలేదు. కోర్టు కేసులతోపాటు అలైన్‌మెంట్‌లో వచ్చిన సమస్యలు కూడా పనులు జాప్యానికి కారణంగా చెప్పవచ్చు. 216 బైపాస్ నిర్మాణం కారణంగా రైల్వే ట్రాక్‌కు ఆనుకొని రోడ్డు వెళ్తోంది. దీని వల్ల రైల్వేట్రాక్ నిర్మాణం సరికాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. రోడ్డు దిగిన వెంటనే ట్రాక్ దాటాల్సి ఉందని ఇది భవిష్యత్‌లో ప్రమాదాలకు కారణమవుతుందని కూడా తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అంచనా వేశారు. ఈ సమస్యలు గుర్తించి అలైన్మెంట్ మార్చారు. బైపాస్ స్టార్ట్ కాక మందే రైల్వేలైన్ వెళ్లేలా ప్లాన్ చేశారు. దీని ప్రకారం భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టారు. ఈ ప్లాన్ ప్రకారం రెండు చోట్ల మాత్రమే 216 జాతీయ రహదారి మీదుగా రైల్వేలైన్ వెళ్తుంది. ఇప్పుడు కొత్త అలైన్మెంట్‌కు ఆమోదం, కోర్టు కేసులో ఎత్తివేయడంతో అధికారులు పనులు వేగం పెంచారు. భూసేకరణ ప్రక్రియ వేగం పెంచారు. ఈ సేకరణ పూర్తి అయితే పెండింగ్ పనులు పూర్తి కావడానికి ఎంతో సమయం పట్టదని అధికారులు అంటున్నారు.