
ఏలూరు, జూలై 7,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా 2024 ఎన్నికల తరహాలోనే ఆలోచిస్తున్నారు. వైసీపీ పై విమర్శలు చేయడం మాని తమ ప్రభుత్వం ఏం చేయనుందో చెబితే బాగుంటుంది. మళ్లీ వైసీపీని అధికారంలోకి రానివ్వనంటూ శపథాలు చేసినంత మాత్రాన ఈసారి సాధ్యం కాకపోవచ్చు. 2024 ఎన్నికలకు,2029 ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అప్పుడంటే పవన్ కల్యాణ్ ను అధికారంలో అప్పటి వరకూ ఎవరూ చూడలేదు. పవన్ కల్యాణ్ కు అధికారం ఇస్తే తమకు మంచిజరుగుతుందని భావించారు. అంతేకాదు కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి జనసేనానికి ఉందని నమ్మి ప్రజలు ఓటేశారు కానీ ఏడాదికే విషయం అర్థమయిపోయిందని జనసేన పార్టీ నేతలే అంటున్నారు. తాము మొన్నటి ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడి జెండాను మోసి త్యాగాలు చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోకపోయినా అడిగే నాధుడే లేని వాపోతున్నారు. అనేక మంది జనసేన నాయకుల్లో ఇదే అభిప్రాయం ఉంది. ప్రశ్నించే తత్వాన్ని పవన్ కోల్పోయారని, కేవలం రాజీ పడుతూ తన పదవి కోసమే ఉన్నారన్న కామెంట్స్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. తాము గత ఎన్నికల్లో ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోయినా తమను ఆదుకునే వారు కూడా లేరని అంటున్నారు. కోవూరు నియోజకవర్గం జనసేన నేత ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించాలి. తాము అడుక్కుతింటున్నాపట్టించుకోరా? అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారంటే పరిస్థితికి అద్దం పడుతుంది లీడర్లలోనూ... ఇది కేవలం జనసేన నేతలు మాత్రమే కాదు. క్యాడర్ లోనూ, కాపు సామాజికవర్గంలోనూ ఇదే అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తమను పూర్తిగా పక్కన పెట్టేశారని బహిరంగంగానే చెబుతున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తమను పట్టించుకోవడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకునే వారు లేరని వారు ఆవేదన చెందుతున్నారు. కేవలం తన మంత్రిత్వ శాఖ విషయంపై చూసుకుంటూ పార్టీని పూర్తిగా వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో జెండాను పట్టుకుని ఎవరు తిరుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాది కాకముందే జనసేన క్యాడర్ లోనూ, నేతల్లోనూ, కాపు సామాజికవర్గంలోనూ పవన్ పై ఉన్న భ్రమలు తొలగిపోయాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.. ఇక జనంలో కూడా పవన్ కల్యాణ్ ఈ ఏడాది కాలంలోనే పలుచన అయ్యారని చెప్పక తప్పదు. ఎన్నికల ప్రచార సభల్లో ఊగిపోయిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే తలూపడం మినహా మరేమీ చేయలేకపోతున్నారన్న బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉందన్నది అనేక సర్వేల్లో వెల్లడవుతున్న వాస్తవాలు. ప్రభుత్వంలో ఉంటూ అధికార పక్షాన్ని నిలదీయమని చెప్పడం లేదు కానీ కనీసం ముఖ్యమైన సమస్యల విషయంలో చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయకుండా వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనంటూ శపథాలు చేసినంత మాత్రాన సరిపోదని సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందుగా తమ పాలనపై సమీక్ష చేసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగస్వామి కావాలని కోరుతున్నారు.