
తిరువనంతపురం, జూలై 7,
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి. నిఫా వైరస్ విజృంభణతో కేరళ గజగజలాడుతోంది. మలప్పురం జిల్లా చెట్టియారంగడిలో నిపా వైరస్ కారణంగా 18 ఏళ్ల బాలిక మరణించింది. నిపా కాంటాక్ట్ అనుమానితుల జాబితాలో 345 మంది ఉన్నారని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మలప్పురం పాలక్కాడ్ కోజికోడ్ లలో హై అలర్ట్ ప్రకటించారు. పాలక్కాడ్ అయితే నిఫా వైరస్ వ్యాప్తి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిపా వైరస్ సోకిన వ్యక్తి కాంటాక్ట్ అయిన 58 మందిని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాధి సోకిన వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో వార్డులను జిల్లా కలెక్టర్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. బహిరంగ సభలను నిషేధించారు. మెడికల్ స్టోర్స్ మినహ, దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్తలకు సెలవు ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్ లలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించారు.