
నెల్లూరు, జూలై 8,
నెల్లూరులో ఇద్దరు మంత్రుల మధ్య పొసగడం లేదని తాజాగా బయటపడింది. నెల్లూరులో వీఆర్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యా మంత్రి లోకేష్ పాల్గొన్నారు. మంత్రులు నారాయణతో పాటు ఆనం రామనారాయణరెడ్డి కూడా పాల్గొన్నారు. అందరూ స్కూల్ ఓపెనింగ్ గురించి మాట్లాడారు. అయితే మంత్రి ఆనం మాత్రం అనూహ్యంగా స్కూల్ కు మున్సిపల్ కార్పొరేషన్ పేరు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి వీఆర్ హైస్కూల్‌ను మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌గా మార్చడంపై వేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారని, స్కూల్ అభివృద్ధికి మున్సిపల్ మంత్రి సహకరిస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా అవుతుందని ప్రశ్నించారని తెలుస్తోంది. చాలా మంది కాంట్రాక్టర్లు తమ సీఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే స్కూల్ రీఓపెన్ అయిందన్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి , పొంగూరు నారాయణ మధ్య స్కూల్ విషయంలో వివాదాలు ఉన్నట్లుగా ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ పేరు వివాదంపై మంత్రి నారాయణ ఎలాంటి కామెంట్లు చేయలేదు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ అసలు పేరు వెంకటగిరి రాజా హైస్కూల్. 2021లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మూతపడింది. గత ప్రభుత్వ హయాంలో స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది, దీని వల్ల నిర్వహణ కష్టమైంది. స్కూల్ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, తగిన నిర్వహణ మరియు ఆధునీకరణ లేకపోవడం కూడా మూతకు కారణమైంది. ఎయిడెడ్ సంస్థల ఆస్తులపై దృష్టి పెట్టి స్కూల్‌ను మూసివేసేలా చేసిందని విమర్శలు ఉన్నాయి. 2025లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి పొంగూరు నారాయణ , నారా లోకేష్ ఆధ్వర్యంలో, రూ. 15 కోట్ల నిధులతో స్కూల్‌ను ఆధునీకరించి, అంతర్జాతీయ ప్రమాణాలతో జూలై 7, 2025న తిరిగి ప్రారంభించారు. ఎన్‌సీసీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చింది. మంత్రివర్గంలో నెల్లూరు జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు పొంగూరు నారాయణ కాగా..మరొకరు సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి. ఆనం దేవాదాయశాఖను చూస్తున్నారు. పొంగూరు నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. ఆయనే మున్సిపల్ కార్పొరేషన్ పేరును పెట్టించారని ఆనం భావిస్తున్నారు. గతంలో వీఆర్ స్కూల్ తమ నిర్వహణలో ఉండేదని.. తమపై కోపం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా నిర్వీర్యం చేసి మూసేయించారని అన్నారు. అయితే మున్సిప్ల పేరు పెట్టకుండా.. ఎవరు పేరు పెట్టాలి.. ఆనం కుటుంబీకుల పేరు పెట్టాలా లేకపోతే.. సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిన కంపెనీ పేరు పెట్టాలా అన్నదాన్ని మాత్రం.. ఆనం చెప్పలేదు. ఈ వ్యవహారంతో నెల్లూరు జిల్లాలోని మంత్రుల మధ్య పొసగడం లేదని అర్థం అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.