
విశాఖపట్టణం, జూలై 8,
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో తీపికబురు చెప్పింది.. ఉత్తరాంధ్రలో కీలకమైన మరో గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు లైన్ క్లియర్ అయ్యింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మాణం కానుంది. ఇటీవల ఈ హైవే గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని రిక్వెస్ట్ చేశారు.. దీంతో ఓకే చెప్పారు. ఈ హైవే మూలపేట పోర్టుకు అనుసంధానంగా ఉంటుందని చెబుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా, వేగంగా వెళ్లేందుకు ఉపయోగంగా ఉంటుందంటున్నారు.విశాఖపట్నం నుంచి భీమిలి వరకు జాతీయ రహదారి ఉంది.. భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం జరుగుతోంది.. అటు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు ఆరు లేన్ల రహదారి అవసరం ఉందన గుర్తించారు. అందుకే భోగాపురం ఎయిర్ పోర్టుకు, మూలపేట పోర్టుకు కనెక్టివిటీని పెంచే పనిలో ఉన్నారు.. విశాఖఫట్నం వరకు లింక్ చేయనున్నారు. అటు పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటుగా ఆక్వా పరిశ్రమలు కూడా వస్తాయని భావిస్తున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ హైవేకు సంబంధించి ఫోకస్ పెట్టారు. ఆయన కూడా ఈ కోస్టల్ నేషనల్ హైవే ఆవశ్యకతను కేంద్రానికి వివరించారు. అయితే సుమారు 200 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు భూ సేకరణ ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ హైవేకు సంబంధించి ఆదేశాలు ఇంకా రాలేదని.. ఒకవేళ వస్తే కనుక డీపీఆర్ రెడీ చేస్తామంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో అటవీ, తీరప్రాంత, జిరాయితీ, స్థలాలు ఎంత అవసరమో గుర్తిస్తామన్నారు.మరోవైపు మూలపేట పోర్టు పరిధిలో అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్ కంపెనీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ పాలీఇథలీన్ పరిశ్రమను 1,250 ఎకరాల్లో రూ.83,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతవారం ఆ సంస్థ ప్రతినిధులు అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్డీవో ప్రభుత్వం సంస్థకు కల్పించే సౌకర్యాలను వివరించారు. మూలపేట పోర్టుకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. పోర్టు ఆవశ్యకతను కూడా వివరించారు.