
విజయవాడ, జూలై 8,
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులకు భయం పోయినట్లుంది. ఇన్నాళ్లు రెడ్ బుక్ అని భయపడి కొంత వెనక్కు తగ్గిన వారు ఇప్పుడు తలెత్తి మరీ తొడకొడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ ఇద్దరు ముగ్గురు వైసీపీ నేతలు మాత్రమే బయటకు వచ్చి అధికార పార్టీపై విమర్శలు చేసేవారు. వరస కేసులు నమోదవుతుండటంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తుండటంతో కొంతకాలం మౌనం పాటించడమే మంచిదని భావించి తమ నియోజకవర్గానికే కొందరు వైసీపీ నేతలు పరిమితం కాగా, మరికొందరు మాత్రం వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాలకు దూరంగా కాలం వెళ్లబుస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది అయిన తర్వాత మాత్రం నేతలందరూ ఒక్కొక్కురుగా బయటకు వస్తున్నారు.ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడటంతో పాటు ప్రధానంగా తమకు కూటమి వల్ల ఇబ్బందులుగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కొంత అనుకూలత కనిపిస్తుండటంతో ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వచ్చి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. వల్లభనేనివంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్, కాకాణి గోవర్థన్ రెడ్డి లాంటి వారు జైలుకెళ్లి బయటకు వచ్చారు. కేసులు పెట్టినా మహా అయితే రెండు నుంచి మూడు నెలలు జైల్లో ఉంటామని, ఆ తర్వాత నియోజకవర్గంలో సానుభూతి పెరగడంతో పాటు తమకు వచ్చే ఎన్నికల్లో అడ్వాంటేజీగా మారుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే దమ్ముంటే కేసులు పెట్టుకోవాలంటూ సవాల్ విసురుతున్నారు.వైఎస్ జగన్ పదే పదే వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు తధ్యమని చెబుతుండటంతో పాటు అవసరమైతే కొత్త తరం నేతలను ఎంపిక చేస్తామని చెబుతుండటంతో ఇక బయటకు రాక తప్పడం లేదు. ప్రధానంగా జగన్ కూడా ఎవరు ఈ ఏడాది నుంచి యాక్టివ్ గా ఉన్నారు? ఎవరు ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉన్నారన్న లెక్కలు తీస్తున్నారట. వారు ఇన్నాళ్లు బయటకు రాకపోవడానికి గల కారణాలపై కూడా నివేదికలు తెప్పించుకున్నారని తెలిసిన నేతలు ఇక అసలుకే ఎసరు వస్తుందని భావించి ఇప్పడు స్ట్రీట్ ఫైట్ కు సిద్ధమయ్యారు. జగన్ కూడా వరసగా కార్యక్రమాలను ఇస్తుండటం, ఏ నియోజకవర్గాల్లో ఎవరు పాల్గొన్నారన్నది రిపోర్టులు తెప్పించుకోవడంతో కొంత నేతల్లోనూ అలజడి స్టార్టయిందంటున్నారు.మొన్నటి వరకూ ఉత్తరాంధ్ర నేతలు పెద్దగా యాక్టివ్ గా లేరు. అలాగే తూర్పు గోదావరిజిల్లా నేతలు కూడా తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందా? లేదా? అన్నసందేహంలో ఉన్నారు. అయితే కాపు సామాజికవర్గంలోనూ కొంత సానుకూలత ఏర్పడటంతో పాటు జగన్ వైపు కొన్ని వర్గాలు మొగ్గు చూపుతున్నాయని తెలుసుకున్న నేతలు ఇక దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లే కనపడుతుంది. మరొక వైపు ఏదో ఒక సమస్యపై జగన్ జిల్లాల పర్యటనలకు వస్తుండటంతో కూడా తమ ప్రాంతానికి వచ్చినప్పుడు జగన్ కు తప్పుడు సమాచారం ఎవరైనా ఇస్తారేమోనని చెప్పి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారట. పార్టీ కార్యాలయంతో పాటు నియోజకవర్గంలోనే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఏడాదిలోనే ఫ్యాన్ పార్టీలో ఎంత మార్పు అని సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.