
విజయవాడ, జూలై 16,
మద్యం కుంభకోణం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీని ద్వారా భారీగా ధనం హవాలా రూపంలో విదేశాలకు వెళ్లిపోయిందని అనుమానిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మద్యం ద్వారా వచ్చిన నగదును ఖర్చు చేసేందుకు కూడా వైసిపి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు జరిగాయి. మరోవైపు ఇప్పుడు ఎంపీ మిధున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అప్పట్లో మద్యం కంపెనీలతో డీల్.. డిష్టలరీలను చేజిక్కించుకోవడం వంటి వాటిలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. దీంతో మిధున్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం సాగింది. ఈ తరుణంలో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు నిరాశ ఎదురయింది.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన, అవినీతికి పాల్పడిన నేతలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వైసిపి మద్యం పాలసీ ద్వారా వేలకోట్ల ముడుపులు అందాయని అనుమానిస్తోంది. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు హవాలా రూపంలో దేశం దాటించారని కూడా అంచనా వేస్తోంది. ఈ మొత్తం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందని తేలింది. ముందుగా ఆయన అరెస్టు జరిగింది. అప్పటి సీఎంఓ కీలక అధికారి ధనుంజయ రెడ్డి, మొన్నటికి మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ కావడంతో ఆయన అరెస్టు విషయంలో దర్యాప్తు బృందం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు.. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు తిరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ విషయంలో తీర్పు వచ్చింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే మిథున్ రెడ్డి అరెస్టు జరగకుండా.. రక్షించలేమని న్యాయస్థానం తేల్చేసిందన్నమాట.
మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి సూత్రధారి. ఈ విషయం వైయస్సార్ కాంగ్రెస్ మాజీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మద్యం కంపెనీలతో డీల్ కు సంబంధించి సిట్టింగులు జరిగాయని.. అందులో నేను కూడా ఉన్నానని.. కానీ ఆ కుంభకోణంతో తనకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని స్పష్టమవుతుంది. అందుకే విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డిని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి ద్వారా వ్యవహారం నడిపింది మిథున్ రెడ్డి అని.. ప్రతి శనివారం తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి లెక్కలు చెప్పే వారని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే లిక్కర్ స్కాం డబ్బులను మనీ లాండరింగ్ గా చేశారని.. దీనికి సంబంధించి సిట్ వద్దా స్పష్టమైన సాక్షాలు ఉన్నాయి. కానీ చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ముందస్తు బెయిల్ పొందాలని మిధున్ రెడ్డి భావించారు. అయితే సుప్రీంకోర్టు వరకు ఈ ముందస్తు వెళ్ళగా.. హైకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. కానీ హైకోర్టులో ఇప్పుడు షాకింగ్ తీర్పు వచ్చింది. మిథున్ రెడ్డి అరెస్ట్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఒకటి రెండు రోజుల్లో అరెస్టు తప్పదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?