
జైపూర్ జూలై 17,
భారత్.. ప్రపంచంలో ఎక్కువ చమరు దిగుమతి చేసుకునే దేశాల్లో మూడోస్థానంలో ఉంది. దేశ అవసరాల్లో కేవలం 15 శాతం మాత్రమే భారత్‌లో ఉత్పత్తి అవుతోంది. 85 శాతం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా క్రూడ్ ఆయిల్‌ను భారత్‌కు చౌకగా సరఫరా చేస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు అమెరికా, నాటో, గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తే భారత్‌ఫై వంద శాతం సుంకాలు విధిస్తామని అమెరికా, నాటో తాజాగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాతోపాటు, గల్ఫ్ దేశాలకు షాక్ ఇచ్చేలా భారత్ ప్రణాళికా రూపొందించింది. రాజస్థాన్‌లోని బాడ్‌మేర్–సాంచోర్ ప్రాంతంలో చమురు నిల్వల ఆవిష్కరణ భారత ఇంధన రంగంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. థార్ ఎడారిలో గుర్తించిన ఈ నిల్వలు దేశ ఇంధన స్వావలంబన లక్ష్యానికి ఊతం ఇవ్వనున్నాయి. రాజస్థాన్‌లోని బాడ్‌మేర్ బేసిన్ భారతదేశంలో అతిపెద్ద ఆన్‌షోర్ చమురు క్షేత్రాలలో ఒకటి. 2004లో గుర్తించిన మంగళ, భాగ్యం, ఐశ్వర్య క్షేత్రాలు 2009 నుంచి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ క్షేత్రాలు దేశంలోని మొత్తం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో సుమారు 29% తీరుస్తున్నాయి. 2022లో రాజస్థాన్ నుంచి 5.9 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అయింది. అయితే 2023 నాటికి ఈ మొత్తం 3.9 మిలియన్ టన్నులకు తగ్గింది. ఈ క్షీణత సహజంగా ఉన్న క్షేత్రాల నీటిపారుదల వల్ల సంభవించింది. 2022లో వేదాంత సంస్థ 2017/1 బ్లాక్‌లో దుర్గా–1 అనే చమురు నిల్వను గుర్తించింది. అయితే, దీని వాణిజ్య సాధ్యత ఇంకా పరీక్షలో ఉంది. తాజాగా బాడ్‌మేర్ బేసిన్‌లో 200 కొత్త చమురు బావుల తవ్వకం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు వేదాంత సంస్థకు చెంది టైర్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రణాళిక సిద్ధమైంది. త్వరలోనే బావుల తవ్వకం ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అమెరికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియాకు చెందిన సంస్థలు భారీ ఎక్విప్ మెంట్ తో భారత్‌కు రానున్నాయి. రష్యా ఆయిల్ సరఫరాను అడ్డుకునేందుకు అమెరికా, నాటో దేశాలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో 200 బావుల్లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి జరిగితే మన దేశ అవసరాలకు పోనూ ఇంకా మిగిలే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పుడు భారత్ కూడా గల్ఫ్ దేశాల తరహాలో ఎగుమతి చేసే అవకాశం ఉంది. పెట్రో ధరలు తగ్గి దేశ ఆర్థికవృద్ధి కానుంది. సామాన్యులకు ఇదో గొప్ప ఊరట.. ఆర్థిక స్వావలంబనకు దోహదపడనుంది. అదే జరిగితే గల్ఫ్ దేశాలు నమ్మకమైన అతిపెద్ద దిగుమతిదారును కోల్పోవడంతోపాటు, పోటీదారును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అమెరికా, నాటో సహా పాశ్చాత్య దేశాల బెదిరింపులకు భారత్ భయపడాల్సిన అవసరం అగత్యం ఉండదు.