
నల్గోండ, జూలై 17,
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు 33 కిలోమీటర్ల దూరంలో మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ విస్తరణకు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును సాధించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.ఈ నిర్ణయంపై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు భువనగిరి ప్రజల భవిష్యత్‌కు సరికొత్త బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టు కోసం డిమాండ్ వినిపిస్తోంది. ఏడాది ఏప్రిల్ నెలలో కూడా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీలు లేవనెత్తారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ రూట్ పొడిగిస్తే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వాదించారు. అప్పట్లో కాంగ్రెస్ ఎంపీలు వేసిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వివరణాత్మక సమాధానం ఇచ్చారు. కేంద్రం సహకారం పూర్తిగా ఉంటుందని అప్పుడే తెలిపారు. చెప్పినట్టుగానే ఇప్పుడు ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు 33 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్టును ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లు మొదటి విడతగా కేటాయించింది. ఈ నిధుల విడుదలతో పాటు, భూసేకరణ, ఇతర ముందస్తు పనులు వేగవంతం చేయడానికి అవకాశం కల్పించింది. విస్తరణ రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. ఈ 33 కిలోమీటర్ల ప్రాజెక్టు ద్వారా, ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు సుస్థిర, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గం ప్రధానంగా యాదాద్రి దేవాలయానికి వెళ్లే లక్షల మంది భక్తులకు, సమీప ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు పూర్తైన తర్వాత, రోడ్డు రవాణా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టు సమీప గ్రామాల్లోని ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేసి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ మార్గం నిర్మాణం కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, రాష్ట్రంలో పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 330 కోట్లతో ప్రతిపాదించినప్పటికీ.. నిధుల కేటాయింపులో జాప్యం కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం మొత్తం వ్యయం రూ. 464 కోట్లకు చేరగా.. ఈ పనులను కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో చేపట్టనుంది. రైల్వే అధికారుల అంచనా ప్రకారం రెండేళ్లలోపు ఈ పనులు పూర్తవుతాయిఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి యాదాద్రికి ప్రయాణం గణనీయంగా సులభతరం అవుతుంది. కేవలం రూ. 20 టిక్కెట్‌తో సుమారు గంటలోపే యాదాద్రి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. యాదాద్రి, జనగామ జిల్లా ప్రజలు సులువుగా హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. కాగా, జనగామ వరకు ఎంఎంటీఎస్ పొడిగింపునకు మరోమారు కేంద్రంతో చర్చిస్తానని ఎంపీ చామల వెల్లడించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు ఎంఎంటీఎస్ లైన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఘట్‌కేసర్ నుంచి మరో 33 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే యాదాద్రి కనెక్టివిటీ పూర్తి అవుతుందని చెప్పారు.