
హైదరాబాద్, జూలై 17,
నీటిపారుదల శాఖలో రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. నిన్న ఏసీబీ అధికారులు పదిచోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కోట్లాది రూపాయల అక్రమార్జన బయటపడిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మురళీధరరావును అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చి జైలుకు పంపారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని మరింత విచారించే అవకాశముందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మురళీధరరావు ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఆయన ఆస్తుల విలువ నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో విలువైన భూములు, ఇంటి స్థలాలలతో పాటు పవర్ ప్రాజెక్టు, ఖరీదైన ఫ్లాట్లు, ఇంటి స్థలాలు, విల్లాతో పాటు బంగారం, వెండి ఆభరణాలను ఉన్నట్లు కనుగొన్నారు. ఇక బ్యాంకు లాకర్లను కూడా తెరవాల్సి ఉంది. అది తెరిస్తే ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయోనంటున్నారు. హైదరాబాద్ లోని మోకిలాలో 6,500 చదరపు గజం స్థలం ఉంది. అలాగే హైదరాబాద్ శివార్లలో పదకొండు ఎకరాల సాగు భూమి కూడా ఉంది. జహీరాబాద్ లో టూ కేవీ సోలార్ పవర్ ప్రాజెక్టును కూడా మనోడు నిర్వహిస్తున్నాడు.. దీంతో పాటు బంజారాహిల్స్, యూసఫ్ గూడ, కోకపేట, బేగంపేట్లో నాలుగు ఫ్లాట్లు, నాలుగు ఇళ్లస్థలాలను ఉన్నట్లు సోదాల్లో ఏసీబీ అధికారులు కనుగొన్నారు.వరంగల్, కోదాడా ప్రాంతంలోనూ అపార్ట్ మెంట్లతో పాటు కొండాపూర్ లోని ఖరీదైన విల్లా ఉంది. అయితే లాకర్ ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన మురళీధరరావు ఈఎన్సీగా చేసి రిటైర్ అయ్యారు. పదమూడేళ్ల పాటు నీటిపారుదల శాఖలో పనిచేసిన మురళీధరరావు ఆస్తులు మరెన్ని బయటపడతాయన్నది చూడాల్సి ఉంది. ఈ దాడుల్లో కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మురళీధరరావు అన్ని ఆస్తులు అక్రమార్జనతో కొనుగోలు చేసినట్లు ఏసీబీ డీజీ విజయకుమార్ తెలిపారు. అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.