YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంశీకి జైలు భయం

వంశీకి జైలు భయం

విజయవాడ, జూలై 18, 
వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. ఆయనకు మరోసారి అరెస్టు భయం వెంటాడుతోంది. హైకోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఒకవేళ సుప్రీం ఆదేశాల మేరకు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టి.. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చితే మాత్రం వల్లభనేని వంశీ మోహన్ కష్టాల్లో పడినట్టే. దాదాపు 5 నెలలపాటు జైల్లో గడిపారు వల్లభనేని వంశీ మోహన్. ఈనెల రెండున జైలు నుంచి విడుదలయ్యారు. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు అనుకూలంగా తీర్పు రావడం పై సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈరోజు దానిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ ఏడాది ఫిబ్రవరి 17న హైదరాబాదులోఅరెస్ట్ అయ్యారు వల్లభనేని వంశీ మోహన్. ఆయనపై గతంలో నమోదైన కేసులతో పాటు కొత్త కేసులను సైతం పెట్టారు. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లపై కూడా కోర్టులు సానుకూలంగా స్పందించలేదు. ఆయన వేసిన పిటిషన్లను రద్దు చేశాయి. దీంతో సుదీర్ఘకాలం రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన తర్వాత తిరిగి జైల్లోకి వెళ్లేవారు. అయితే దాదాపు 11 కేసులు ఆయనపై నమోదు కాగా.. పది కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. చివరిగా మైనింగ్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే వల్లభనేని వంశీ మోహన్ ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు తీరును తప్పు పట్టింది సుప్రీంకోర్టు. మరోసారి విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు మరోసారి విచారణ చేపట్టి తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.అయితే సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల్లో ఒకటి వంశీకి అనుకూలంగా ఉంది. కేవలం హైకోర్టుకు మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని మాత్రమే సూచించింది. ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేయడం వంశీకి స్వల్ప ఉపశమనం. వల్లభనేని వంశీ పై నమోదైన మిగిలిన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. హైకోర్టుతో పాటు కింది కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి. దీంతో ఈ నెల రెండు నా ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత మరోసారి అస్వస్థతకు గురికావడంతో తిరిగి ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రతి నెల రెండో శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేస్తూ వస్తున్నారు. తీవ్ర జ్వరంతో సైతం ఈ నెల రెండో శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Related Posts