YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఆంధ్రాలో అలా.... తెలంగాణలో ఇలా ముందస్తు ఎన్నికలు

ఆంధ్రాలో అలా.... తెలంగాణలో ఇలా ముందస్తు ఎన్నికలు
ముందస్తు ఎన్నికలపై ఒకవైపు హడావిడి సాగుతుంటే మరోవైపు తెలుగు రాష్ట్రాల నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. తెలంగాణలో నాయకులు ముందస్తు ఎన్నికలు వస్తే ఉత్తమం అనే భావనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలను సమాయత్తం చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఏపీ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వాతావరణాన్ని కల్పించగలిగామని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. స్థానికంగా నెలకొని ఉన్న అంశాలు, పార్టీలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాల్లో ఏపీలో కొంత వెనకబాటుతనం కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లోని అధికారపార్టీలు మంచిమార్కులు సాధిస్తామని భావిస్తున్నాయి. కానీ అభివృద్ధి పథకాల విషయంలో ఇంకొంత గడువు అవసరమవుతుందని టీడీపీ సర్కారు భావిస్తోంది. కేసీఆర్ ఈవిషయంలో తాము చాలా సాధించామన్న భావనలో ఉన్నారు. దాంతో ముందస్తుకే జై కొడుతున్నారు.తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటికీ నేతల్లో సమన్వయం నెలకొల్పడంలో అధిష్ఠానం విపలమవుతోంది. నాయకులకు పదవులు పంచడం మినహా వారెవరూ క్షేత్రస్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. పదవులపై కొట్లాట , అసంతృప్తి ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఎస్సీ,ఎస్టీ మైనారిటీలను ఆకట్టుకునేందుకు జాతీయస్థాయిలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. రిజర్వుడ్ నియోజకవర్గాలపై దృష్టిపెట్టాలని భావిస్తున్నారు. ఇదంతా ఫలించేందుకు మరికొంత సమయం పడుతుంది. ఈలోపుగానే ఎన్నికలు వచ్చేస్తే బాగుంటుందని కేసీఆర్ ఆశిస్తున్నారు. చెల్లాచెదురుగా ఉన్న కాంగ్రెసు వర్గాలు కలవకుండానే విడిపోతాయి. ఎన్నికల మాట ఎత్తగానే టిక్కెట్లు మొదలు నియోజకవర్గాల వరకూ పోటీలు పడి నేతలు కలహించుకుంటారు. ఐక్యత ఆవిరయిపోతుంది. ఇది కాంగ్రెసు పార్టీ సంస్కృతి . దీనిని ప్రాతిపదిక చేసుకునే కేసీఆర్ సాధ్యమైనంత తొందరగా ఎన్నికల తంతు ముగించేస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నారంటున్నారు. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు చొరవ తీసుకుంటే తాము సైతం సై అంటున్నారు. రైతు బంధు వంటి పథకాలూ తమకు కలిసి వస్తాయనేది కేసీఆర్ భావన. ఆపరేషన్ ఆకర్ష్ తో తో ఇతర పార్టీల్లో మిగిలిపోయిన పెద్ద నాయకులు అందర్నీ కారు ఎక్కించే పనిలో పడ్డారురాజధాని నిర్మాణం, పోలవరం తెలుగుదేశానికి ఎన్నికల నినాదాలు కావాలనేది చంద్రబాబు యోచన. తాజాగా అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. మరో ఏడాదిలో పనులు కొలిక్కి వస్తాయి. దీనిని నమూనాగా చూపించి అమరావతికి టీడీపీ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజల్లో ఓట్లు అడగాలనేది ఆపార్టీ వ్యూహం. పోలవరం పనులు సైతం గడచిన నెలరోజులుగా బాగా పుంజుకున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకపోయినప్పటికీ ఏడాదిలోపు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే చాలు ఓట్ల వర్షం కురుస్తుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగానే ఉంచినప్పటికీ ఎంతవరకూ ఓట్లు కురిపిస్తుందో గ్యారంటీ లేదు. దాంతో ప్రాంతీయంగా ఉన్న కొన్ని సెంటిమెంట్లను పతాకస్థాయికి తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే రాయలసీమ వాసులను ఆకట్టుకోవడానికి కడప ఉక్కుపై ఎంపీ సీఎం రమేశ్ నిరాహారదీక్షలకు తెర తీశారు. దీనికి మంచి మైలేజీ వస్తున్నట్లు పార్టీ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర రైల్వేజోన్ విషయంలోనూ ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లి టీడీపీకి అనుకూలమైన గాలి రావడానికి కొంత సమయం పట్టవచ్చనుకుంటున్నారు. టీడీపీ పోరాటం చేస్తున్న విషయం ప్రజల్లో బాగా పాతుకుపోవాలంటే దీర్ఘకాలం ఉద్యమం చేయాల్సి ఉంటుందనేది అంచనా. నవంబరు,డిసెంబర్ నెలల్లో ముందస్తు ఎన్నికలు వస్తే హడావిడి అయిపోతుందనుకుంటున్నారు. అదే ఫిబ్రవరి, మార్చి నాటికి పనులన్నీ కొలిక్కి వస్తాయి. అడ్వాంటేజీ టీడీపీగా మారుతుందని భావిస్తున్నారు.ఏపీలో ప్రధాన ప్రతిపక్షనేత జగన్ ఇప్పటికి దాదాపు ఏడునెలలుగా ప్రజల్లో ఉన్నారు. ఆయన పాదయాత్ర మరో మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉంది. అప్పటికి రాష్ట్రంలోని 125 నియోజకవర్గాలు కవర్ చేసినట్లవుతుంది. మరో 50 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేయాలని ముందుగానే నిర్ణయించారు. దాదాపు డిసెంబరు వరకూ షెడ్యూలు ఖరారు అయిపోయినట్లే. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ షెడ్యూలును మార్చుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక, రాజకీయ వ్యూహాలపై దృష్టి పెట్టేందుకు తగినంత గడువు అవసరమవుతుంది. ఇక కొత్తగా రంగంలోకి దిగుతోంది జనసేన. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు తొమ్మిది నెలల కనీస గడువు అవసరమవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత క్రమేపీ పెరుగుతోంది. ఇది మరింత పటిష్టమవుతుంది. అందువల్ల ఎన్నికలు గడువు ప్రకారమే వస్తే మంచిద’నే ఆలోచనలో ఉన్నాయి వైసీపీ, జనసేనలు.

Related Posts