YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూడు రోజుల పర్యటనకు గడ్కరీ

మూడు రోజుల పర్యటనకు గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటను రానున్నారు. జులై 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట పోలవరం సందర్శన, తర్వాత విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న మంత్రి రెండు గంటలపాటు పనులను పరిశీలించనున్నారు. అయితే, శరవేగంగా ఈ పనులు ముందుకు సాగాలంటే 2013-14 సవరణ అంచనాలను కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. కానీ అంచనాలపై కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ కొర్రీల మీద కొర్రీలను వేస్తూ వస్తోంది. తాజాగా, 2010-11 అంచనా వ్యయం అయిన రూ.16,010.45 కోట్లతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగడం లేదు. మరో వైపు ప్రాజెక్టు వ్యయాన్ని సవరించి 2013-14 నాటి లెక్కల ప్రకారం రూ.58319.306 కోట్లకు పెంచారు. గత  ఏడాది ఆగస్టులో సీడబ్ల్యూసీకి రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయాలతో నివేదిక పంపించింది. ఏప్రిల్‌ 2014 నుంచి ఈ ఏడాది జూలై వరకు పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.8598.25 కోట్లు ఖర్చు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.4343.52 కోట్లను విడుదల చేసింది.పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.13,798 కోట్లు ఖర్చు చేశారు. నాలుగేళ్లలో రూ.8660 కోట్ల పనులు చేయగా.. రూ.6727 కోట్లు కేంద్రం ఇచ్చింది. డీపీఆర్-1కు సంబంధించి రూ.431 కోట్ల నిధులు రావాల్సి ఉంది. సిఎం చంద్రబాబు పోలవరం నిధుల గురించి గడ్కరీకి లెటర్ మే నెలాఖరు వరకూ ఖర్చు చేసిన 1335 కోట్ల రూపాయిలకు బిల్లు పంపించారు.పోలవరం ప్రాజెక్టు కోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన రూ.1,400 కోట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ప్రాజెక్టు అథారిటీ ఖాతాలో జమయింది. ఈ ఏడాది మార్చి 31లోపే రూ.1400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిధుల సమీకరణ కోసం నాబార్డుకు అనుమతినిచ్చినా వివిధ కారణాల వల్ల అది ఆ పని చేయలేకపోయింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన మరో రూ.766 కోట్ల బిల్లులు ప్రస్తుతం ప్రాజెక్టు అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిశీలించి కేంద్ర జలవనరుల శాఖకు పంపితే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావాల్సి ఉంటుంది. ఈ నిధులన్నీ కేంద్రం పాత డీపీఆర్‌ ప్రకారమే ఇస్తోంది. కొత్త డీపీఆర్‌కు ఆమోదముద్ర వేయలేదు. పాత డీపీఆర్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టు సాగునీటి విభాగం అంచనా వ్యయం రూ.12,294 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందే దీనిపై రూ.5,136 కోట్లు వెచ్చించారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వబోమని లోగడే కేంద్రం స్పష్టం చేసింది. అదిపోగా మిగిలిన రూ.7,158 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటివరకూ ప్రస్తుత రూ.1,400 కోట్లతో కలిపి రూ.6,764 కోట్లు చెల్లించినట్లయింది.ఇక మిగిలింది రూ.395 కోట్లు మాత్రమే. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్‌కు కేంద్రం ఆమోదించకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి కేవలం రూ.395 కోట్లు మాత్రమే వస్తుంది. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక సహాయ, పునరావాస ఖర్చులు పెరిగిపోవడం, 2014 జూన్‌ 2నాటికి ఉన్న ధరల ప్రకారం సాగునీటి విభాగం నిర్మాణ ఖర్చును కేంద్రం భరిస్తుందని హామీనివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.53వేల కోట్లతో సవరించిన అంచనాలు పంపింది. అందులో సహాయ, పునరావాసానికి రూ.33,225 కోట్లు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,509.46 కోట్లు ఖర్చవుతుందని అంచనా. సవరించిన అంచనాలపై సీడబ్ల్యూసీలో ఇప్పటికే పలు దఫాలు చర్చించారు. అది వేసిన కొర్రీలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం పంపింది. అయినప్పటికీ ఇంతవరకూ దానికి ఆమోదముద్ర వేసే విషయంలో సానుకూలత కనిపించడం లేదు. ఈ విషయంలో కేంద్రం జాప్యం చేస్తే మాత్రం మున్ముందు పోలవరానికి నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాదికి తాత్కాలిక ప్రాతిపదికన పోలవరానికి రూ.10వేల కోట్లు విడుదల చేయాలంటూ లేఖ రాశారు. సవరించిన అంచనాలు ఆమోదించేంత వరకూ నిధులు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమయ్యే ప్రమాదం ఉన్నందున తాత్కాలికంగా రూ.10వేల కోట్లకు అనుమతినిచ్చి డీపీఆర్‌కు అంతిమ ఆమోదం పొందాక ఈ మొత్తాన్ని అందులో సర్దుబాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం.

Related Posts