YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రిపబ్లిక్ డే కు ట్రంప్..!!

 రిపబ్లిక్ డే కు ట్రంప్..!!
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కేంద్రం ఆహ్వానించింది. ఒకవేళ ఇదే జరిగితే మోదీ విదేశాంగ విధానంపై వస్తున్న విమర్శలకు సమాధానంతోపాటు సర్కారు చేసుకుంటున్న ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. దీనిపై అమెరికా అధికారిక ప్రకటన కోసం భారత్ వేచిచూస్తోంది. అయితే, గత కొద్ది వారాలుగా భారత్‌కు అనుకూలంగా ట్రంప్ సర్కారు వ్యవహరించడాన్ని బట్టి చూస్తే ఏప్రిల్‌లో పంపిన ఆహ్వానం పట్ల సానుకూలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. భారత్ ఆహ్వానంపై ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య పలుసార్లు ఇప్పటికే చర్చలు జరిగాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావడానికి ట్రంప్ అంగీకరిస్తే, మోదీ హాయాంలోనే వచ్చిన రెండో అమెరికా అధ్యక్షుడవుతారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత నిర్వహించిన 2015 గణతంత్ర వేడుకలకు నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రంప్ యొక్క చంచలమైన, హేతుబద్దమైన నిర్ణయాలతో ప్రపంచంలోని ప్రతి ప్రధాన దేశం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. భారత్ లాంటి దేశాలు కూడా దీనికి మినహాయింపు కాదు. వాణిజ్య సుంకాలతోపాటు చమురు దిగుమతుల విషయంలో ఇరాన్‌తో చారిత్రక సంబంధాలు, రష్యా నుంచి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత ప్రతిపాదనలపై అమెరికా విముఖంగా ఉంది. ఒబామా మాదిరిగానే అమెరికా ప్రాధాన్యత జాబితాలో భారత్ కూడా ఉన్నట్టు ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై అమెరికా విధించిన ఆంక్షలు ప్రభావం చూపుతాయని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి కారణాలవల్లే జులై మొదటి వారంలో జరగాల్సిన ఉన్నతస్థాయి చర్చలను కూడా అమెరికా వాయిదావేసిందని భారత్ నమ్ముతోంది. అందుకే ఈ విభేదాలను పరిష్కరించుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మకంగా రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ట్రంప్‌ను భారత్ ఆహ్వానించింది. అమెరికాతో విభేదాలు అధిగమించలేనివి కావని, ఇటీవల పొరుగు దేశాలతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి ట్రంప్ పర్యటన దోహదపడుతుందని మోదీ సర్కారు బలంగా నమ్ముతోంది. అలాగే విదేశాంగ విధానంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాదు, వచ్చే సాధారణ ఎన్నికల్లో దీని వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం అంచనా వేస్తోంది. భారత్ ఆహ్వానాన్ని ట్రంప్ అంగీకరిస్తే అంతర్జాతీయంగా 2019 గణతంత్ర ఉత్సవాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. 2015లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హాలెండో, 2017లో దుబాయ్ రాజు మహ్మద్ బిన్ జైద్ అల్ నహ్యాన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక 2018లో ఏకంగా పది ఆసియా దేశాధినేతలు హాజరుకావడం విశేషం. 

Related Posts