YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జనసేన, వైసీపీ మధ్య పోరు

జనసేన, వైసీపీ మధ్య పోరు
ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన‌-వైసీపీ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు నెల‌కొంది. ఇత‌ర పార్టీ నాయకుల‌ను ఆక‌ర్షించే ప‌నిలో రెండు పార్టీల నాయ‌కులు ప‌డ్డారు. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాలపై ఇరు పార్టీల నాయ‌కులు దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నిక‌ల్లో కీల‌కమైన ఈ జిల్లాల్లో ప‌ట్టు సాధించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాదయాత్ర జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆ పార్టీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడైన ముత్తా గోపాల‌కృష్ణ‌ జ‌న‌సేన‌లో చేరిపోయారుకాకినాడ కేంద్రంగా రాజ‌కీయాలు హీటెక్కాయి. కాకినాడ‌లో ప‌ట్టున్న నాయ‌కుడు కావ‌డంతో పాటు.. జ‌న‌సేన కూడా ఆ ప్రాంతంపైనే ఫోక‌స్ పెట్టిన త‌రుణంలో.. ముత్తా చేరిక జ‌న‌సేన‌లో జోష్ నింపుతుంద‌ని విశ్లేష‌కులు స్ప‌ష్టంచేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయులు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. కాకినాడ సిటీలో ముత్తాకు రాజకీయంగా ఇమేజ్‌ ఉంది. టీడీపీలో మంత్రిగా, కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా పదవులు చేపట్టిన ఆయ‌న‌కు కాకినాడ సిటీతోపాటు జిల్లాలో వైశ్య సామాజికవర్గంలో బలమైన పట్టుంది. ఆయన తనయుడు శశిధర్‌ కూడా క్రియాశీల రాజకీయ నేతగా ఎదిగారు. జగన్‌ సొంత మనిషి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కాదని.. కాకినాడ సిటీ వైసీపీ కోఆర్డినేటర్‌గా శశిధర్‌ని నియమించారు. ఇటీవల వరకు కాకినాడ సిటీ వైసీపీ అభ్యర్థి శశిధరే అన్న ప్రచారం జోరుగా సాగింది. కొన్ని నెలల కిందట శశిధర్‌ని తప్పించి ద్వారంపూడికి కోఆర్డినేటర్‌ పదవి కట్టబెట్టడంతో ముత్తా కుటుంబం అలిగింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన వీరు.. పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. వైసీపీకి ముత్తా గుడ్‌బై చెప్పడంతో సిటీలో ఆ పార్టీ కొంత బలహీనపడినట్టేనని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు.2014లో అసెంబ్లీ టికెట్‌ రాకపోవడంతో టీడీపీని వీడి ముత్తా శశిధర్‌ వైసీపీలో చేరారు. ఈ నాలుగేళ్లలో వైసీపీని తనవంతు బలోపేతం చేశారు. కాకినాడ సిటీలో కీలకమైన సామాజికవర్గంలో మెజార్టీని తమవైపు తిప్పుకోగల సామర్థ్యం ముత్తా కుటుంబానికి ఉంది. గతంలో తమతోపాటు వైసీపీలో ఉన్న కేడర్‌ని ఇప్పుడు జనసేనలోకి బదలాయించే పనిలో నిమగ్నమయ్యారు. తాను గ‌తంలో ప‌వ‌న్‌ను క‌లిసిన సంద‌ర్భంలో.. తనను పార్టీలోకి రావాలని కోరారన్నారు. `మీ సేవలు మాకు చాలా అవసరమని, మీ అనుభవం పార్టీకి కావాల`ని పవన్‌ అడిగే సరి కి కాదనలేకపోయానని స్పష్టం చేశారు.రాష్ట్ర పొలిటికల్‌ అడ్వజైర్‌ కమిటీలో ప్రధానమైన స్థానం కల్పించాలని కమిటీ సభ్యులకు పవన్‌ సూచించగానే తాను నిర్ఘాంతపోయానని తెలిపారు. గతంలో టీడీపీలో ఎన్టీఆర్‌తో, కాంగ్రె్‌సలో వైఎస్‌తో పనిచేసిన అనుభవాన్ని జనసేనకు ఉపయోగించాలని కోరారన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీకి కాకినాడ నియోజ‌క‌వ‌ర్గంలోనే గాక జిల్లా రాజ‌కీయాల్లోనే కొంత ఎదురుదెబ్బ త‌గిలింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ముత్తా బాట‌లోనే ఎంత‌మంది వెళ‌తారో వేచిచూడాల్సిందే. ఇక జ‌న‌సేన ప్ర‌భావం గ‌ట్టిగా ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్న తూర్పుగోదావ‌రి జిల్లాలో ముత్తా ఫ్యామిలీతో పాటు ప‌లువురు కీల‌క నాయ‌కులు కూడా అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నుంచి జ‌న‌సేన‌లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

Related Posts